: విశాఖలో ఎన్ కౌంటర్... ఆయుధాలు వదిలి పరారైన మావోలు
విశాఖపట్నం జిల్లాలో నేటి తెల్లవారుజామున ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు జిల్లాలోని జీకే వీధి మండలం నడింపాలెం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో పోలీసులకు సరెండర్ అయ్యేందుకు మావోలు నిరాకరించడమే కాక పోలీసు బలగాలపైకి కాల్పులు ప్రారంభించారు. దీంతో పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరిపారు. అయితే పోలీసు కాల్పులు మరింత ఎక్కువ కావడంతో మావోయిస్టులు పారిపోయారు. ఈ క్రమంలో వారు తమ ఆయుధాల్లో కొన్నింటిని అక్కడే వదిలివెళ్లారు. ఎన్ కౌంటర్ ముగిసిన అనంతరం పోలీసులు ఘటనా స్థలంలో రైఫిల్ తో పాటు బుల్లెట్లు, ల్యాండ్ మైన్, మూడు కిట్ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు.