: అమ్మవారు నైవేద్యం ఆరగించారట... అర్ధరాత్రి ఆలయానికి క్యూ కట్టిన భక్తజనం
తనకు నైవేద్యంగా పెట్టిన అన్నాన్ని కనకదుర్గమ్మ ఆరగించారట. ఈ విషయం ఆ నోటా ఈనోటా పాకి అర్ధరాత్రైనా క్షణాల్లో విస్తరించింది. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు అప్పటికప్పుడు భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. ఈ ఘటన నిన్న రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో చోటుచేసుకుంది. నిన్న రాత్రి పూజల్లో భాగంగా అమ్మవారికి పూజల అనంతరం నైవేద్యం పెట్టిన అర్చకులు గర్భగుడి తలుపులు వేశారు. అనంతరం అరగంట తర్వాత తలుపులు తెరిచి చూడగా, అమ్మవారి చేతిలోని స్పూను, నోటికి నైవేద్యంగా పెట్టిన అన్నం మెతుకులు కనిపించాయి. అంతేకాక గర్భగుడి ప్రాంగణంలో అమ్మవారి అడుగులు కూడా పూజారులు, ఆలయ కమిటీ సభ్యులకు కనిపించాయట. ఈ విషయం నగరంలో వేగంగా వ్యాపించింది. దీంతో ఆలయానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు.