: గుప్పెడు మెతుకుల కోసం అతన్ని కిడ్నాప్ చేశారు!
రైతు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని మహానేతలంతా బోధించారు. అయితే ఇప్పటి రైతన్న పరిస్థితి ఏంటో తెలుసా? గుప్పెడు మెతుకుల కోసం ఓ వ్యక్తిని కిడ్నాప్ చేశారు. మహారాష్ట్రలోని మరఠ్వాడ ప్రాంతంలోని ఘటాంబ్రి ప్రాంతంలో ముగ్గురు రైతులు సుదమ్ సురద్ కర్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారు. అనంతరం అతని టిఫిన్ బాక్సును తీసుకుని ఆబగా తినేశారు. ముగ్గురికీ ఆ ఒక్క టిఫిన్ బాక్సు సరిపోకపోవడంతో వెంటనే అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, భోజనం పంపిస్తే కానీ అతనిని విడిచిపెట్టమని బెదిరించారు. దీంతో అతని కుటుంబ సభ్యులు భోజనం పంపారు. అది తీసుకున్న ఆ ముగ్గురు వ్యక్తులు సురద్ కర్ ను విడిచిపెట్టారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు, ఆ ముగ్గురు ఎవరు? అనే దానిపై ఆరాతీస్తున్నారు. గుప్పెడు మెతుకుల కోసం కిడ్నాప్ చేశారంటే ఆ ప్రాంతంలో రైతన్నల ఆర్తనాదాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.