: 15 వేల కోట్లున్నాయి...అయినా అశాంతి ... 'ఇదీ ఒక జీవితమేనా?' అంటూ వాపోతున్నాడు!
అతను 15 వేల కోట్ల రూపాయలకు యజమాని. ఎనిమిది బెడ్ రూంలు, 18 బాత్రూమ్ లు, 16 కారు పార్కింగ్ గ్యారేజీలు, వాటిల్లో ఖరీదైన కార్లు, అందమైన నగీషీలు కలిగిన ఫర్నిచర్ తో 18 అడుగుల డైనింగ్ హాల్, ఏ గదిలోంచి చూసినా అద్భుతంగా కనిపించే ఫసిఫిక్ మహాసముద్రం... 23 వేల చదరపు గజాల్లో సొంత భవనం. ఇవేవీ ఆ బిలియనీర్ కు సంతృప్తినివ్వడం లేదని వాపోతున్నాడు. స్వీడన్ కు చెందిన మార్కస్ పర్సన్ ది గత కొంత కాలం వరకు సాధారణమైన జీవితం. అవసరానికి సరిపడా డబ్బుంటే బాగుండేదని భావించేవాడు. కంప్యూటర్ ప్రోగ్రామర్ గా పని చేస్తూనే మైన్ క్రాఫ్ట్ అనే వీడియో గేమ్ ను కనిపెట్టాడు. దీనిని సుమారు పది లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. దీంతో అతని అకౌంట్ ఫుల్లయిపోయింది. ఇంతలో మైక్రోసాఫ్ట్ కంపెనీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. దీంతో మైన్ క్రాఫ్ట్ గేమ్ ను అమ్మేశాడు. దీంతో వేల కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి. అయితే, ఇతని బాల్యం కష్టాలమయం. తాగుబోతు తండ్రి నుంచి మార్కస్ తల్లి అతని 12 ఏటే విడిపోయింది. దొంగతనాలు చేసి జైలు పాలైన తండ్రి 2011లో ఆత్మహత్య చేసుకున్నాడు. మత్తుమందులకు బానిసైన సోదరి అన్నా ఇంటి నుంచి ఎటువెళ్లిపోయిందో ఆచూకీ లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఏడాది కాపురం చేసి విడిపోయింది. మరో పేద అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకుంటే ఆమె కూడా ఓ సామాన్యుడితో వెళ్లిపోయింది. దీంతో, లంకంత కొంపలో ఒంటరిగా మిగిలిపోయిన మార్కస్, ఒంటరితనం పోగొట్టుకునేందుకు సెలబ్రిటీలకు పార్టీలిస్తుంటాడు. వారు వెళ్లిపోయాక ఇదేనా తాను కోరుకున్నది? అని ఆలోచించి, పని వాళ్లను తీసుకుని విహార యాత్రలకు వెళ్లేవాడు. అయినా ఆనందం కలగలేదు. దీంతో 'కోరుకున్నది కాళ్ల దగ్గరకు వస్తే ఆనందం లేదు. దాని కోసం కలలు కనాలి, కష్టపడి దానిని సాధించుకోవాలి. సాధించిన విజయం తాలూకు అనుభూతిని ఆస్వాదించాలి. దాని నుంచి కొత్త లక్ష్యం నిర్దేశించుకోవాలి, దాని కోసం మళ్లీ కష్టపడాలి. అలా కాకుండా, తనలా లక్ష్యం లేకపోతే ఒంటరివారవుతార'ని మార్కస్ పేర్కొంటున్నాడు.