: జమ్ముకాశ్మీర్ ప్రభుత్వం నాపై గూఢచర్యం చేస్తోంది: ఒమర్ అబ్దుల్లా
జమ్ముకాశ్మీర్ ప్రభుత్వంపై మాజీ సీఎం, ప్రతిపక్ష నేత ఒమర్ అబ్దుల్లా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆ రాష్ట్ర సీఎం ముప్తీ మహ్మద్ సయ్యద్ సర్కార్ పై మండిపడ్డారు. ముప్తీ ప్రభుత్వం తనపై గూఢచర్యం చేస్తోందని, అంతగా తన గురించి వివరాలు కావాలనుకుంటే నేరుగా తనకే ఫోన్ చేసి అడగొచ్చు కదా? అన్నారు. కానీ ఇలాంటి సిగ్గుమాలిన చర్యలు ఎంతవరకు సబబు? అని ఒమర్ ప్రశ్నించారు. ఒమర్ ను తన ఇంట్లోనే ఓ జాతీయ పత్రిక జర్నలిస్టు ఇంటర్వ్యూ చేసి బయటకు వెళుతుండగా సీఐడీ అధికారులు అడ్డుపడ్డారట. జర్నలిస్టు వివరాలు, ఏయే ప్రశ్నలకు ఆయన ఎలా సమాధానం చెప్పారన్న విషయాలను సేకరించారట. ఇది తెలుసుకున్న ఒమర్ వెంటనే ట్విట్టర్ లో తనపై ప్రభుత్వం గూఢచర్యం చేస్తోందంటూ ట్వీట్లు చేశారు. అంతేకాదు "డియర్ ముఫ్తి సాబ్.. మీ టెలిఫోన్ నుంచి నాకు కాల్ చేయొచ్చు. ఎలాంటి విషయమైనా అడగొచ్చు. కానీ నా ఇంటికొచ్చేవారిని ఇబ్బంది పెట్టకండి" అంటూ ఒమర్ సూచించారు.