: బెంగళూరులో రూపాయికే కిలో ఉల్లి కావాలా?... అయితే ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సిందే!


మార్కెట్ లో కిలో ఉల్లి రూ.80 దాకా పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల చొరవతో కొన్ని గంటల పాటు క్యూలో వేచి ఉంటే రూ.20కే కిలో ఉల్లిగడ్డలు దొరుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉల్లి ఘాటు దేశవ్యాప్తంగా విస్తరించేసింది. అయితే బెంగళూరు వాసులకు ఉల్లి ఘాటు నుంచి కాస్తంత ఉపశమనం కల్పించేందుకు ఓ సంస్థ రంగప్రవేశం చేసింది. కిలో ఉల్లిని కేవలం రూపాయికే అందజేస్తామంటూ ఆ సంస్థ మొదలెట్టిన ప్రచారంపై ప్రస్తుతం కర్ణాటకలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయినా ఏదో ఒక లింకు లేకుండా ఆ సంస్థ ఈ బంపరాఫర్ ఎందుకు ప్రకటిస్తుందిలే అనే కదా మీ అనుమానం. లింకైతే ఉంది కాని, అది అంత పెద్దగా గాభరా పడాల్సినదేమీ కాదు. నెలవారీగా కొనుగోలు చేసే పచారీ సరుకులను తన యాప్ ద్వారా కొనుగోలు చేయాలని, అందుకోసం తమ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే సరిపోతుందని ‘నింజాకార్ట్’ ప్రకటించింది. హైపర్ లోకల్ గ్రోసరీ డెలివరి యాప్ తో సరుకులు కొంటే, సరుకులతో పాటు రూపాయికే కిలో ఉల్లిని మీ ఇంటి ముంగిటకే చేరవేస్తామని ఆ సంస్థ ప్రకటించింది. కాస్తంత తాపీగా స్పందిద్దామనుకునే వారికి ఆలసించిన ఆశాభంగం కాక తప్పదు. ఎందుకంటే, ఈ బంపరాఫర్ ఈ రోజు నుంచి ఆదివారం వరకు మాత్రమే అమల్లో ఉంటుందట.

  • Loading...

More Telugu News