: సైనా నెహ్వాల్ టార్గెట్ ఇప్పుడు ఆమె పైనే!
బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతున్న సైనా నెహ్వాల్ ఇప్పుడో టార్గెట్ పెట్టుకుంది. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్, ప్రపంచ ఛాంపియన్ షిప్ లలో తనను అడ్డుకున్న స్పెయిన్ షట్లర్ మారిన్ కరొలినానే తన లక్ష్యమని తెలిపింది. తనను ఈ రెండు టోర్నీల్లో ఓడించిన ఆ యువ క్రీడాకారిణిని రాబోయే జపాన్ ఓపెన్ లో ఓడించి ప్రతీకారం తీర్చుకుంటానంటోంది. అందుకోసం కోచ్ విమల్ కుమార్ వద్ద కఠిన శిక్షణ తీసుకుంటున్నట్టు సైనా వెల్లడించింది. ఏడాది కాలంలో చైనీస్ క్రీడాకారిణులందరినీ ఓడించానని, ఇప్పుడు కరోలినాను ఎదుర్కోవడమే మిగిలిన పనని చెప్పింది. టాప్ ర్యాంక్ ను నిలబెట్టుకోవాలంటే దూకుడు కొనసాగించాల్సి ఉంటుందని సైనా పేర్కొంది. ముఖ్యంగా బెంగళూరులో తాను శిక్షణ తీసుకుంటున్నప్పటి నుంచి తన ఆటతీరు, ఫిట్ నెస్ ఎంతో మెరుగయ్యాయని ఆమె వివరించింది.