: గుండెలు పిండేసే ఘటనకు స్పందించి...మానవత్వం చాటుకున్న ఆర్టీసీ కార్మికులు


పేదరికం తెచ్చిన కష్టానికి కన్నీళ్ల పాలవుతున్న మనిషిని చూసిన ఆర్టీసీ కార్మికులు మానవత్వం చాటుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన షఫీ హైదరాబాదులోని కాటేదాన్ లో లారీ క్లీనర్ గా పనిచేస్తున్నారు. ఎప్పట్లాగే పనిలోకి వెళ్లిన షఫి ఇంటికి వచ్చి చూసేసరికి భార్య లేదు. ఏమైందని విచారిస్తే నిండుచూలాలైన భార్య నొప్పులతో కాలనీలోని ఓ ఆసుపత్రిలో చేరిందని తెలిసింది. దీంతో పరుగుపరుగున ఆసుపత్రికి వెళ్లి చూడగా, పండంటి పాపకు జన్మనిచ్చిన ఆమె (మస్రత్ బేగ్ (35) మాత్రం మరణించింది. ఆమెతో పాటు ఎవరూ రాకపోవడంతో ఆమె శవాన్ని ఆసుపత్రిలో ఓ మూలనపడేశారు. దీంతో విలపిస్తూనే భార్య శవాన్ని భుజాన వేసుకున్నాడు. స్వగ్రామంలో భార్యకు అంత్యక్రియలు నిర్వహించాలి. కానీ ఎలా? ఇద్దరు పిల్లలు, భార్య శవంతో రాయచూర్ వెళ్లే బస్సెక్కాడు. హైదరాబాదు నుంచి మక్తల్ వెళ్లాలంటే ఒకరికి 156 రూపాయలు టికెట్. ఈ లెక్కన వారాంతా చేరుకోవాలంటే 312 రూపాయలు కావాలి. కానీ జేబులో 200 రూపాయలే ఉన్నాయి. దీంతో పాలమూరు వరకు టికెట్ తీసుకుని భార్య బాలింత అని చెప్పి వెనుక సీట్లో ఆమె శవాన్ని పడుకోబెట్టాడు. ఇద్దరు పిల్లల్ని పొదివి పట్టుకుని పాలమూరు చేరుకున్నాడు. భార్య శవాన్ని భుజాన వేసుకుని బస్టాండ్ లో దిగాడు. జేబులో చిల్లిగవ్వలేదు. కూడా జీవితం పంచుకున్న భార్య మృతదేహం... చేతిలో రోజు పసికందు...పక్కనే అన్నెంపున్నెం ఎరుగని ఇద్దరు పసిబిడ్డలు...దేవుడా ఏమిటీ పరీక్ష...ఎందుకీ జన్మ...అంటూ చిన్నపిల్లాడిలా ఏడుస్తుండగా, గమనించిన ఆర్టీసీ కార్మికులు అతనిపాలిట దేవుళ్లే అయ్యారు. జరిగినదంతా విని చలించిపోయారు. క్షణాల్లో కర్తవ్యం గుర్తున్న సైనికుల్లా కదిలారు. పది, యాభై, వంద, రెండు, మూడు వందలు ఇలా మనిషికి తోచినంత చందాలు వేసుకున్నారు. 8 వేల రూపాయలు పోగు చేశారు. ఓ ఆటోను బేరానికి కుదిర్చారు. అంత్యక్రియలు నిర్వహించు అంటూ అతని స్వగ్రామం ఉట్కూరుకు పంపారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని, పసికందును ఆసుపత్రికి తరలించారు. మస్రత్ బేగ్ కు వైద్యం చేసిన ఆసుపత్రిలో సరైన వైద్యం అందించారా? లేదా? అనే విషయాన్ని దర్యాప్తు చేయనున్నారు. ఇంత సాయం చేసిన ఆర్టీసీ కార్మికులకు జీవితాంతం రుణపడి ఉంటానని షఫి తెలిపి, భార్య శవాన్ని తీసుకుని స్వగ్రామం బయల్దేరాడు.

  • Loading...

More Telugu News