: ఏపీ మంత్రి అచ్చెన్నాయుడి మైక్ కట్ చేసిన కోడెల
అసెంబ్లీలో కరవుపై చర్చ జరుగుతున్న సమయంలో, చర్చను పక్కదారి పట్టించబోయిన ఏపీ మంత్రి అచ్చెన్నాయుడి మైక్ ను స్పీకర్ కోడెల శివప్రసాదరావు కట్ చేశారు. చర్చలో భాగంగా జగన్ మాట్లాడుతూ, పట్టిసీమ అంశాన్ని ప్రస్తావనకు తెచ్చారు. దీన్ని అధికార పక్ష సభ్యులు అడ్డుకోగా, స్పీకర్ కల్పించుకుని, చర్చను కరవుకు మాత్రమే పరిమితం చేయాలని, మరే ఇతర అంశాన్నీ ప్రస్తావించేందుకు అంగీకరించబోనని స్పష్టం చేశారు. ఈ సమయంలో అచ్చెన్నాయుడు మైక్ కావాలని కోరగా, మాట్లాడాలని కోడెల అన్నారు. అచ్చెన్నాయుడు వెంటనే వ్యక్తిగత విమర్శలకు దిగుతూ, వైఎస్ చనిపోయిన తరువాత, వివిధ కారణాలతో మరణించిన వారిని అందరినీ, వైఎస్ మృతితో మనస్తాపం చెంది మరణించారని చెబుతూ, ఆరేళ్లుగా ఓదార్పు యాత్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఆయనింకా విమర్శలు గుప్పిస్తుండగానే కోడెల మైక్ కట్ చేశారు. సాధారణంగా అసెంబ్లీలో మంత్రులు మాట్లాడుతున్నప్పుడు మైక్ కట్ చేయడం అత్యంత అరుదుగా జరుగుతుంది. దీంతో ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.