: నాటి ప్రధాని హామీలన్నీ అమలు చేయాల్సిందే: చంద్రబాబు
రాష్ట్ర విభజన సమయంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్, పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ఇచ్చిన హామీలన్నీ, నేటి నరేంద్ర మోదీ సర్కారు నెరవేర్చాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తేల్చి చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై మండలిలో తీర్మానం చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన కోరారు. హైదరాబాద్ వంటి నగరం నిర్మించాలంటే కనీసం 20 సంవత్సరాలు పడుతుందని ఆయన అన్నారు. యూపీఏ ప్రభుత్వం ఎటువంటి సంప్రదింపులు లేకుండా, ఏకపక్షంగా రాష్ట్రాన్ని విభజించిందని చంద్రబాబు మరోసారి ఆరోపించారు. ఈ సంవత్సరం వర్షపాతం తక్కువగా ఉండటం వల్ల ప్రాజెక్టుల్లోకి నీరు చేరలేదని తెలిపిన ఆయన, రాష్ట్రానికి రావాల్సిన ఇతర ప్రాజెక్టుల కోసం ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులతో తాను సంప్రదింపులు జరిపానని వివరించారు. రాష్ట్రానికి ఎంతో అన్యాయం జరిగిందని, కేంద్రం సహకరిస్తేనే తిరిగి వృద్ధి బాటలో కొనసాగే వీలుంటుందని తెలిపారు. ఫైనాన్స్ కమిషన్ తో సంబంధం లేకుండా ఆదుకుంటేనే ఏపీ నిలబడుతుందని బాబు నొక్కి చెప్పారు.