: ఫిక్సెడ్ డిపాజిట్లు ఎన్ని వేసినా ధనవంతులు కాలేరు... ఎందుకంటే!
ఫిక్సెడ్ డిపాజిట్లలో పెట్టే పెట్టుబడులు అత్యంత సురక్షితమైనవని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. అయితే, దీర్ఘకాలంలో కేవలం ఫిక్సెడ్ డిపాజిట్లు సంపద సృష్టిలో ఇతర మార్గాలతో పోలిస్తే ఎంతో వెనుకబడి వుంటాయి. ఇందుకు కారణం ఫిక్సెడ్ డిపాజిట్లపై వచ్చే ఆదాయం ద్రవ్యోల్బణంతో పోలిస్తే తక్కువగా ఉండటమే. గడచిన రెండేళ్లలో (2012-14) ఇండియాలో ఇన్ ఫ్లేషన్ సరాసరిన 9.76 శాతంగా ఉంది. ప్రస్తుతం ఇండియాలో ఎఫ్డీలపై 8.5 శాతం మాత్రమే వడ్డీ వస్తోంది. వీటిపై వచ్చే వడ్డీలపై పన్ను చెల్లించాల్సి వుండటంతో, సాలీనా 7 శాతానికి మించి డబ్బు పెరగదు. ఈ కారణంగానే ఎఫ్డీ ఇన్వెస్ట్ మెంట్స్ అధిక ఆదాయాన్ని అందించలేకపోతున్నాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇవాళ లక్ష రూపాయలు ఫిక్సెడ్ చేస్తే 20 సంవత్సరాల తరువాత ఆ మొత్తం రూ. 3.83 లక్షలవుతుంది. (సాలీనా 7 శాతం రాబడితో) అదే డెట్ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టే లక్ష రూపాయలు, రూ. 5.11 లక్షలవుతాయి (సాలీనా 8.5 శాతం రాబడితో). అదే ఇక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇదే మొత్తం రూ. 13.44 లక్షలు అవుతుంది (14 శాతం రాబడి, 8 శాతం ద్రవ్యోల్బణం). ఈక్విటీ ఫండ్స్ లో దీర్ఘకాల రాబడిపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అదే ఫిక్సెడ్ డిపాజిట్ వేస్తే, అమలులో ఉన్న పన్ను స్లాబ్ ఆధారంగా ప్రభుత్వానికి పన్నులను చెల్లించాల్సి వుంటుంది. అందువల్లే సంపద సృష్టికి ఫిక్సెడ్ డిపాజిట్ల కన్నా ఫండ్స్ మేలని నిపుణులు సూచిస్తున్నారు. (మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ మెంట్లలో మార్కెట్ రిస్క్ ఉంటుంది. స్టాక్ మార్కెట్లు పతనమైతే పెట్టుబడిపై రాబడి కూడా తగ్గుతుంది. దీన్ని గుర్తెరిగి పెట్టుబడులు పెట్టాల్సి వుంటుంది. అయితే, దీర్ఘకాలంలో మార్కెట్లు పెరిగే అవకాశాలే అధికం.)