: ర్యాగింగ్ పై ఐఏఎస్ ఉదయలక్ష్మి కొరడా...వీసీ హోదాలో ‘నాగార్జున’ విద్యార్థిపై సస్పెన్షన్
బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య తర్వాత ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నేటి ఉదయం వెలుగు చూసిన ర్యాగింగ్ ఘటనపై ఇన్ చార్జీ వీసీ, సీనియర్ ఐఏఎస్ అధికారి ఉదయలక్ష్మి వేగంగా స్పందించారు. ర్యాగింగ్ కు పాల్పడ్డ విద్యార్ధిపై కొరడా ఝుళిపించారు. రెండు వారాల పాటు సస్పెండ్ చేశారు. వివరాల్లోకెళితే... రిషితేశ్వరి ఘటనతో అప్పటిదాకా ఉన్న వీసీని బదిలీ చేసిన ప్రభుత్వం ఐఏఎస్ ఉదయలక్ష్మిని ఇన్ చార్జీ వీసీగా నియమించిన సంగతి తెలిసిందే. అయితే, వర్సిటీలో డిగ్రీ ఫస్టియర్ చదువుతున్న ఓ విద్యార్థిని తనపై సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడుతున్నారని వర్సిటీలోని పోలీస్ ఔట్ పోస్టులో ఫిర్యాదు చేసింది. సమాచారం తెలుసుకున్న ఉదయలక్ష్మి వేగంగా స్పందించారు. ఘటనపై విచారణ జరిపించి, ర్యాగింగ్ జరిగిన మాట వాస్తవమేనని నిర్ధారించుకున్నారు. ర్యాగింగ్ కు పాల్పడ్డ విద్యార్థిని గుర్తించిన ఉదయలక్ష్మి రెండు వారాల పాటు అతడిని వర్సిటీ నుంచి సస్పెండ్ చేశారు.