: 'బడా గణేష్'కు దీటుగా బెజవాడలో నాట్య గణపతి... నిమజ్జనం ఉండదు!
'బడా గణేష్'... ఈ పేరు వింటే హైదరాబాదులోని ఖైరతాబాద్ లో వినాయక నవరాత్రుల సందర్భంగా కొలువుదీరే భారీ గణేశుని విగ్రహం గుర్తుకు వస్తుంది. ఈ విగ్రహానికి దీటుగా విజయవాడలో భారీ విగ్రహాన్ని తయారు చేయాలన్న ఆలోచనలో అక్కడి యువత కదిలింది. దీంతో ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల ప్రాంగణంలో ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. డూండీ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో నాట్య గణపతి అవతారంలో వినాయకుడు ఇక్కడ కొలువుదీరనున్నాడు. గోమాత, మృగరాజు, అష్టలక్ష్ముల విగ్రహాలు సైతం ఏర్పాటు కానున్నాయి. ఖైరతాబాద్ వినాయకుడిని తయారు చేసే రూపశిల్పులే దీన్ని కూడా తీర్చిదిద్దుతుండటం విశేషం. కేవలం బంకమట్టి, పీవోపీ, ప్రకృతి రంగులతో తయారయ్యే విగ్రహాన్ని నిమజ్జనం చేయబోరు. ముందుగానే విగ్రహం లోపలి భాగాల్లో వాటర్ పైపులను అమరుస్తున్నారు. ఉత్సవాల ముగింపు రోజున మోటార్ల సాయంతో ఈ వాటర్ పైపుల్లోకి నీటిని పంపుతారు. ఈ నీరు విగ్రహాన్ని తడుపుతూ, కాసేపటికి పూర్తిగా కరిగిపోయేలా చేస్తుంది. ఈ విగ్రహం ఎత్తు 63 అడుగులు కాగా, తాపేశ్వరం లడ్డూ నిపుణులు 6,300 కిలోల లడ్డూను స్వామివారికి నైవేద్యంగా సమర్పించనున్నారు.