: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి ఇక 1,215 రోజులే సమయం!... సీఆర్డీఏ వెబ్ సైట్ లో టైమర్ ఆన్!


నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంపై ఏపీ సర్కారు వడివడిగా అడుగులేస్తోంది. 2018 డిసెంబర్ నాటికి రాజధాని ప్రధాన కేంద్రం (సీడ్ కేపిటల్)ను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని సర్కారు దాదాపుగా తనకు తాను డెడ్ లైన్ విధించుకుంది. ఆ తర్వాతే 2019లో ఎన్నికలకు వెళ్లాలని సీఎం నారా చంద్రబాబునాయుడితో పాటు కేబినెట్ మంత్రులు తమ అంతర్గత సమావేశాల్లో చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఇదే విషయాన్ని చంద్రబాబు, మంత్రులు బాహాటంగానే వెల్లడించారు. తుళ్లూరు మండలం మందడం, తాళ్లాయపాలెంల మధ్య రాజధాని నిర్మాణానికి ఇప్పటికే భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. వచ్చే నెల 22న విజయదశమిని పురస్కరించుకుని నిర్మాణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు జపాన్, సింగపూర్ ప్రధానులను కూడా ఆహ్వానించాలని చంద్రబాబు యోచిస్తున్నారు. లింగాయపాలెం, ఉద్ధండరాయునిపాలెం, తాళ్లాయపాలెం గ్రామాల పరిధిలో సీడ్ కేపిటల్ నిర్మితం కానుంది. ఈ గ్రామాల్లో రాజధాని నిర్మాణానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఈ మూడు గ్రామాల్లో ఇప్పటికే భూ సమీకరణ పూర్తయింది. దాదాపుగా 98 శాతం మంది రైతులు స్వచ్ఛందంగా తమ భూములు ప్రభుత్వానికి అప్పగించారు. గ్రామ కంఠాల సమస్యను కూడా అధికారులు పరిష్కరించారు. ఈ నేపథ్యంలో సీడ్ కేపిటల్ నిర్మాణానికి సంబంధించి సీఆర్డీఏ అధికారులు తమకు తాముగా కౌంట్ డౌన్ నిర్దేశించుకున్నారు. సీడ్ కేపిటల్ నిర్మాణం పూర్తి కావడానికి ఇంకా తమకు 1,215 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని పేర్కొంటూ నిన్న వెబ్ సైట్లో టైమర్ ను ఆన్ చేశారు.

  • Loading...

More Telugu News