: పవన్ కల్యాణ్ పుట్టిన రోజుకు కుటుంబ సభ్యుల బహుమతులివే!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజుకు ఆయన కుటుంబ సభ్యులు వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పారు. పుట్టిన రోజు, పెళ్లి రోజు వేడుకలకు పవన్ మొదటి నుంచీ వ్యతిరేకం. గతంలో ఓ ఫంక్షన్ లో మాట్లాడుతూ, ఏం సాధించామని వేడుకలు చేసుకోవాలని అనిపిస్తుందని కూడా ఆయన అన్నారు. అయితే, తన పుట్టిన రోజున ప్రజా సంక్షేమ, సేవా కార్యక్రమాలు చేపట్టే అభిమానులను చూసి మాత్రం ఆయన గర్విస్తుంటారు. ఈ క్రమంలో వచ్చిన తన పుట్టిన రోజుకు కుటుంబ సభ్యులు ఆయనకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. పెద్దన్నయ్య కుమారుడు రాంచరణ్ 'బ్రూస్ లీ, ద ఫైటర్' టీజర్ విడుదల చేసి బాబాయికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబితే, చిన్నన్నయ్య కుమారుడు వరుణ్ తేజ్ 'కంచె' టీజర్ తో శుభాకాంక్షలు చెప్పాడు. చిన్న మావయ్యకి శుభాకాంక్షలు చెప్పడంలో తన స్టైలే వేరు అని యువ నటుడు సాయిధరమ్ తేజ్ నిరూపించాడు. తన తాజా సినిమా 'సుబ్రమణ్యం ఫర్ సేల్'లో మావయ్య అభిమానిగా ప్రత్యర్థులను రఫ్పాడించే టీజర్ ను విడుదల చేసి అభిమానం ప్రదర్శించాడు. ఇలా మెగా ఫ్యామిలీ విడుదల చేసిన టీజర్లతో మెగా అభిమానులు ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు.