: వీరవాసరం పోలీసుల అదుపులో సైకో ‘సూది’గాడు?
మిస్టరీ మందుతో సిరంజీ దాడులకు పాల్పడుతున్న సైకోను పోలీసులు పట్టేశారా? అంటే, అవుననే అంటున్నాయి పశ్చిమగోదావరి జిల్లా పోలీసు వర్గాలు. నాలుగైదు రోజులుగా ఒంటరిగా వెళుతున్న వారిపై సిరంజీ దాడులకు తెగబడుతున్న సైకోతో ఉభయ గోదావరి జిల్లాల్లో తీవ్ర కలకలం రేగింది. సిరంజీ దాడి చేసిన వెంటనే మాయమవుతున్న సైకో పోలీసులకు పట్టుబడకుండా చాకచక్యంగా తప్పించుకుని తిరుగుతున్నాడు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు ముమ్మర తనిఖీలు చేసినా ఫలితం లేకపోయింది. అయితే నేటి ఉదయం జిల్లాలోని వీరవాసరం పోలీసులు సైకోను అరెస్ట్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. తమ చేతికి చిక్కిన సైకోను రహస్య ప్రాంతానికి తరలించిన వీరవాసరం పోలీసులు అతడిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.