: ఏపీ అసెంబ్లీలో ‘శ్రీమంతుడు’,‘జబర్దస్త్’ల సందడి... గంటా, రోజాల మధ్య మాటల తూటాలు
ఏపీ అసెంబ్లీలో టాలీవుడ్ తాజా చిత్రం ‘శ్రీమంతుడు’, ఈటీవీ హిట్ ప్రొగ్రాం ‘జబర్దస్త్’ పదాలు పదే పదే వినిపించాయి. నాగార్జున వర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఘటనపై అధికార, విపక్షాల మధ్య జరిగిన చర్చ సందర్భంగా ఏపీ మానవ నవరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాల మధ్య ఆసక్తికర వాదన జరిగింది. రిషితేశ్వరి ఘటనపై దోషులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి గంటా చెప్పారు. దీనికి స్పందించిన రోజా, ఘటనపై మంత్రి వ్యవహరించిన తీరు సరిగా లేదని ఆరోపించారు. రిషితేశ్వరి చనిపోయిన తర్వాత నాలుగు రోజులకు వర్సిటీకి వెళ్లిన మంత్రి అరగంట పాటు మీడియాతో మాట్లాడి వచ్చారన్నారు. అంతేకాక కూతురు చనిపోయి తీవ్ర వేదనలో ఉన్న రిషితేశ్వరి తల్లిదండ్రులను హోటల్ కు పిలిపించుకుని మంత్రి మాట్లాడారని, ఇదేం పధ్ధతి? అని ఆమె ప్రశ్నించారు. ‘శ్రీమంతుడు’ చిత్రం ఆడియో ఫంక్షన్ కు వెళ్లడానికి సమయం ఉన్న మంత్రికి, రిషితేశ్వరి తల్లిదండ్రులతో మాట్లాడే సమయం చిక్కలేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనిపై మంత్రి కూడా కాస్త ఘాటుగానే బదులిచ్చారు. రోజా వ్యాఖ్యలకు సమాధానం ఇవ్వడానికే ఇబ్బందిగా ఉందని వ్యాఖ్యానించిన గంటా, రోజా కనిపిస్తున్న ఈటీవీ ప్రొగ్రాం ‘జబర్దస్త్’ను ప్రస్తావించారు. ‘జబర్దస్త్’ ప్రొగ్రాం కోసం రోజా పరుగులు పెడుతున్న తీరును కూడా ఆయన ప్రస్తావించారు.