: కన్న తల్లినే బ్లాక్ మెయిల్ చేసిన మిఖాయిల్... పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం!
షీనా బోరా హత్య కేసులో తవ్వుతున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు పుట్టుకొస్తున్నాయి. ఈ కేసులో షీనా బోరా సోదరుడు మిఖాయిల్ కు చాలా విషయాలు తెలిసి వుండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంద్రాణిని అతను రూ. 25 కోట్లు ఇవ్వకుంటే, ఆమెకు చెందిన రహస్యాలు బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేసినట్టుగా సమాచారం. అంతకుమించి, షీనా హత్య చేయబడిందన్న విషయం మిఖాయిల్ కు తెలిసే ఉండవచ్చని, అతను నిజం దాచిపెట్టి డబ్బు డిమాండ్ చేశాడని అనుమానిస్తున్నారు. షీనా హత్య జరిగిన కొద్ది రోజుల తరువాత, ఆమె చిన్ననాటి మిత్రురాలు మిఖాయిల్ కు ఫోన్ చేసి అడిగితే, ఆమె అమెరికా వెళ్లిందని చెప్పిన మిఖాయిల్, ఆ తరువాత కొద్ది రోజులకే రూ. 12 లక్షల విలువైన టాటా ఆరియా కారును కొనడం పోలీసుల అనుమానాలకు ఊతమిస్తోంది. మిఖాయిల్ ఖాతాకు ఇంద్రాణి నుంచి నెలకు రూ. 15 వేలు వెళుతున్నాయని పోలీసులు విచారణలో తేల్చారు. బెంగళూరులో ఓ ఆస్తిని కొనేందుకు రూ. 25 కోట్లను ఇవ్వాలని డిమాండ్ చేశాడన్న అనుమానాలపై పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు. ఈ విషయం నిరూపణ అయితే, నిజాన్ని దాచినందుకు, డబ్బు డిమాండ్ చేసినందుకు ఆయనపై కేసు పెట్టి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.