: మహిళా ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు... ప్రసూతి సెలవును 8 నెలలకు పెంచే యోచన


కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు మహిళా ఉద్యోగులకు త్వరలో తీపి కబురు చెప్పనుంది. గర్భిణులైన మహిళా ఉద్యోగులకు ఇకపై 8 నెలల పాటు సెలవును మంజూరు చేసేందుకు జరుగుతున్న కసరత్తు దాదాపు తుది దశకు చేరుకుంది. ఈ మేరకు నిన్న కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి నూతర్ గుహ బిశ్వాస్ ఈ విషయంపై కాస్తంత స్పష్టంగా వివరించారు. ప్రస్తుతం గర్భిణులయ్యే మహిళా ఉద్యోగులకు మూడు నెలల ప్రసూతి సెలవు లభిస్తోంది. ఇకపై ప్రసూతి సెలవును 8 నెలలకు పెంచాలని ప్రతిపాదిస్తూ కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖకు ప్రతిపాదించింది. కాన్పు అంచనా తేదికి ముందు నెల, కాన్పు తర్వాత ఏడు నెలల పాటు మహిళా ఉద్యోగులకు సెలవు మంజూరు చేయాలని ఆ శాఖ ప్రతిపాదించింది. దీనిపై ప్రధాన మంత్రిత్వ కార్యాలయం (పీఎంఓ) సూచనాప్రాయంగా ఆమోదం తెలపడంతో ఈ ప్రతిపాదనలకు అనుగుణంగా కార్మిక శాఖ ఇప్పటిదాకా ఉన్న చట్టానికి సవరణలు చేసేందుకు రంగంలోకి దిగింది. ‘‘ప్రసూతి సెలవు పెంపు ప్రతిపాదనను కేబినెట్ సెక్రటేరియట్ కు పంపాం. ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికీ తీసుకెళ్లాం. ఆయన ఎంతో సానుకూలత చూపారు. అందుకే ఆయనకూ ఈ ప్రతిపాదన ప్రతిని పంపుతున్నాం’’ అని బిశ్వాస్ చెప్పారు. కేంద్రం నుంచి దీనిపై స్పష్టమైన ఉత్తర్వులు జారీ అయితే, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందుకనుగుణంగా ఈ సెలవును 8 నెలలకు పెంచక తప్పదు.

  • Loading...

More Telugu News