: చిరస్మరణీయ విజయంతో ‘మూడు’కు చేరనున్న టీమిండియా ర్యాంకు
శ్రీలంక రాజధాని కొలంబోలో నిన్న ముగిసిన టెస్టు మ్యాచ్ లో టీమిండియా చిరస్మరణీయ విజయం సాధించింది. ఈ విజయంతో దాదాపు 22 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత లంక గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ ను కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. ఈ విజయం రికార్డుతో పాటు టీమిండియా టెస్టు ర్యాంకింగ్ ను కూడా మెరుగుపరచనుంది. టెస్టు ర్యాంకింగ్స్ లో ప్రస్తుతం టీమిండియా 100 రేటింగ్ పాయింట్లతో ఐదో ర్యాంకులో ఉంది. తాజాగా లంకతో 2-1 తేడాతో సిరీస్ ను గెలుచుకున్న నేపథ్యంలో టీమిండియాకు మరో మూడు రేటింగ్ పాయింట్లు దక్కనున్నాయి. దీంతో జట్టు రేటింగ్ పాయింట్ల సంఖ్య 103కు చేరుకోనుంది. ప్రస్తుతం ర్యాంకింగ్స్ లో టాప్ పొజిషన్ లో ఉన్న దక్షిణాఫ్రికాకు 125 రేటింగ్ పాయింట్లు ఉండగా, రెండో స్థానంలోని ఆస్ట్రేలియాకు 106 పాయింట్లున్నాయి. ఇక మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్లు వరుసగా 102, 101 రేటింగ్ పాయింట్లతో ఉన్నాయి. తాజాగా మూడు రేటింగ్ పాయింట్లు దక్కించుకోనున్న టీమిండియా ఖాతాలో మొత్తం పాయింట్ల సంఖ్య 103కు చేరుకోనుంది. దీంతో ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్లను కిందకు తోసేయనున్న టీమిండియా మూడో ర్యాంకులో నిలవనుంది.