: చెరువు కట్టపై మంత్రుల భోజనం... కాపలా కాసిన కొండెంగ!


తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత, తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రజలతో మమేకమవడంలో ఆయనకు ఆయనే సాటి. కార్యరంగంలోకి దిగితే, ఎంతదాకానైనా ఆయన వెళతారు. ఇక మంత్రి అయిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయించేందుకు ఆయన అహరహం శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో కొనసాగుతున్న పనులను ఆయన నిత్యం పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఇక హరిత హారంలో భాగంగా చెరువులు, పొలాల గట్లపైనా మొక్కలను నాటే కార్యక్రమాలకూ హరీశ్ రావు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన మరో ఇద్దరు మంత్రులు జోగు రామన్న, పద్మారావులతో కలిసి నిన్న వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో మంత్రులు పర్యటించారు. అనంతరం నర్సంపేట మండలం మాదన్నపేట చెరువు కట్టపై హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. అనంతరం అక్కడే మంత్రులు భోజనం చేశారు. అయితే అక్కడ కోతుల బెడద ఎక్కువగా ఉంది. దీంతో మంత్రుల విందుకు పహారా కాసేందుకు పోలీసులతో పాటు కొండెంగ (కొండముచ్చు) కూడా రంగంలోకి దిగింది. కోతుల బెడదకు చెక్ పెట్టేందుకు అధికారులే స్వయంగా కొండెంగను అక్కడికి తీసుకుని వచ్చి మంత్రుల కోసం వేసిన టెంటు సమీపంలో ఓ చెట్టుకు కట్టేశారు. కోతి జాతికే చెందిన కొండెంగ ఉన్న పరిసరాల్లోకి కోతులు అడుగు కూడా పెట్టవట. మంత్రులు భోజనం చేస్తున్నంతసేపూ కొండెంగ అరుస్తూనే ఉందట. దీంతో కోతులు ఆ దరిదాపుల్లోకి కూడా రాలేదు.

  • Loading...

More Telugu News