: వివాదంలో చిక్కుకున్న టోక్యో ఒలింపిక్స్ లోగో... దిద్దుబాటు చర్యల్లో జపాన్
2020లో జపాన్ రాజధాని టోక్యో ఒలింపిక్స్ సంరంభానికి వేదిక కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సన్నాహక చర్యలను ప్రారంభించిన జపాన్ ప్రభుత్వం ఒలింపిక్స్ కు సంబంధించిన లోగోను డిజైన్ చేయించింది. రెండు నెలల క్రితమే ఈ లోగో బయటకు వచ్చేసింది. అయితే ఈ లోగో రూపకల్పనలో తన డిజైన్ ను కాపీ కొట్టారంటూ బెల్జియంకు చెందిన డిజైనర్ ఒలివర్ డెబీ ఆరోపించారు. దీంతో షాక్ తిన్న జపాన్ వెనువెంటనే దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. డెబీ ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే రూపొందించిన లోగోకు మార్పులు చేయాలని జపాన్ సంకల్పించిందట. అంతేకాక ప్రస్తుత లోగోను వెంటనే రద్దు చేయాలని కూడా యోచిస్తోంది. ఇప్పటిదాకా లోగో రద్దుకు సంబందించి అధికారిక ప్రకటన వెలువడకున్నా, జపాన్ మీడియాలో మాత్రం రద్దు నిర్ణయం దాదాపుగా జరిగిపోయిందని కథనాలు ప్రచురితమయ్యాయి.