: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ దీనగాథ!


భారత్, పాకిస్థాన్ దేశాల తరపున అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేస్తే చాలు, జీవితం సాఫీగా సాగిపోతుందని చాలా మంది అనుకుంటుంటారు. భారత్ లో అది నిజమే కానీ, పాకిస్థాన్ లో మాత్రం సాధ్యం కాదని చెబుతున్నాడు అర్షద్ ఖాన్. 1997లో పాక్ తరపున అంతర్జాతీయ క్రికెట్ లోకి బౌలర్ గా అడుగు పెట్టిన అర్షద్ ఖాన్ 2001 వరకు ఆడాడు. 9 టెస్టుల్లో 32, 58 వన్డేల్లో 56 వికెట్లు తీశాడు. భారత దిగ్గజాలు సచిన్, ద్రవిడ్ వికెట్లు కూడా అర్షద్ ఖాన్ ఖాతాలో ఉన్నాయి. అనంతరం ఐసీఎల్ (ఇండియన్ క్రికెట్ లీగ్)లో కూడా ఆడాడు. ఆ తరువాత జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఆయనను ఆస్ట్రేలియాలో ఉబెర్ క్యాబ్ డ్రైవర్ ను చేశాయి. ఈ మధ్యే ఆస్ట్రేలియా వెళ్లిన ఓ వ్యక్తిని ఉబెర్ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్న అర్షద్ ఖాన్ ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా తాను పాకిస్థానీనని పరిచయం చేసుకున్నాడని ఆ వ్యక్తి తెలిపాడు. ప్రయాణంలో మాటలు కలిపాడు. మన హైదరాబాదుతో పెనవేసుకున్న బంధాన్ని గుర్తు చేసుకున్నాడు. నీళ్లు, స్నాక్స్ కూడా ఆఫర్ చేశాడు. క్రికెట్ గురించి తప్ప మిగిలిన విషయాల గురించి బాగానే మాట్లాడాడు. చివరి క్షణంలో అతనిని గుర్తించిన ఆ వ్యక్తి, మీరు అర్షద్ ఖాన్ కదా? అని అడిగినట్టు సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. క్రికెటర్లంటే భారత క్రికెటర్లలాగ కోట్లాది మంది అభిమానులు, కోట్లాది రూపాయల డబ్బు ఉండదని, ఇలాంటి క్రికెటర్లు కూడా ఉన్నారని ఆ నెటిజన్ వ్యాఖ్యానించడం విశేషం. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ గా షేర్ అవుతోంది.

  • Loading...

More Telugu News