: టీమిండియా... కంగ్రాట్స్!: కోహ్లీ సేనకు ప్రధాని మోదీ అభినందనలు
శ్రీలంక గడ్డపై ఆ దేశ జట్టుతో జరిగిన సిరీస్ ను చేజిక్కించుకుని రికార్డులకెక్కిన టీమిండియా టెస్టు జట్టుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు 22 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా లంక గడ్డపై టెస్టు సిరీస్ ను నెగ్గింది. నేటి మధ్యాహ్నం ముగిసిన మ్యాచ్ లో కోహ్లీ సేన 117 పరుగుల తేడాతో లంక జట్టును చిత్తు చేసింది. మూడు టెస్టుల సిరీస్ లో తొలి టెస్టును చేజేతులా జారవిడుచుకున్న కోహ్లీ సేన, ఆ తర్వాత సత్తా చాటింది. వంతుల వారీగా బ్యాట్స్ మెన్ మెరిస్తే, బౌలర్లు కూడా వికెట్ల వేటలో సత్తా చాటారు. దీంతో మొన్న ముగిసిన రెండో టెస్టులో విజయం సాధించిన టీమిండియా, నేడు ముగిసిన మూడో టెస్టులో నూ జైత్రయాత్రను కొనసాగించింది. సిరీస్ ను కైవసం చేసుకుంది. టీమిండియా విజయాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా కోహ్లీ సేనకు గ్రీటింగ్స్ చెప్పారు. సమష్టిగా రాణించి చిరస్మరణీయ విజయాన్ని సాధించారని ఆయన జట్టు సభ్యులను కీర్తించారు.