: ఇరవై రెండేళ్ల సుదీర్ఘ కలను సాకారం చేసిన టీమిండియా
22 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు టీమిండియా తెరదించింది. కొలొంబో టెస్టులో 117 పరుగుల తేడాతో విజయం సాధించింది. విజయం సాధిస్తుందా? కోహ్లీ సేనకు అంతటి సత్తా ఉందా? సంగక్కర, జయవర్ధనే లేని జట్టుపై విజయం సాధించకపోతే టీమిండియా వేస్టు అన్న అభిమానుల వ్యాఖ్యల మధ్య శ్రీలంకలో అడుగుపెట్టిన టీమిండియా తొలి మ్యాచ్ లో విజయం సాధించాల్సిన దశలో ఓటమిపాలై తీవ్ర విమర్శలపాలైంది. ఓటమి నేర్పిన పాఠమో లేక విజయం సాధించాలన్న పట్టుదలో కానీ రెండో టెస్టులో పుంజుకుని విజయం సాధించి సిరీస్ సమం చేసింది. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో పేకమేడను తలపించిన టాప్ ఆర్డర్ తో ఉసూరుమనిపించిన టీమిండియాను పుజారా ఒడ్డున పడేయగా, రెండో ఇన్నింగ్స్ లో మిడిలార్డర్, టెయిలెండర్ల బాధ్యతాయుత ఇన్నింగ్స్ తో విజయానికి అవసరమైన పరుగులు సాధించిన టీమిండియా, లంకేయులకు కళ్లెం వేసి విజయం సాధించింది. ఈ టెస్టు ద్వారా ఇషాంత్ శర్మ 200 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. కాగా, టీమిండియా బౌలర్లలో అశ్విన్ నాలుగు వికెట్లతో రాణించగా, మూడు వికెట్లతో ఇషాంత్, రెండు వికెట్లతో ఉమేష్ యాదవ్, ఒక వికెట్ తో మిశ్రా చక్కని సహకారమందించారు. బౌలర్లు రాణించడంతో టీమిండియా లంకేయులను 268 పరుగులకు ఆలౌట్ చేసింది. దీంతో టీమిండియా 117 పరుగుల భారీ వ్యత్యాసంతో విజయం సాధించింది. దీంతో పూర్తి స్థాయి టెస్టు సిరీస్ గెలుచుకున్న కెప్టెన్ గా కోహ్లీ టీమిండియా చరిత్ర పుటల్లో పేరు లిఖించుకున్నాడు.