: పాక్ తో పొట్టి యుద్ధాలు తప్పవు: ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్
సరిహద్దుల్లో నిత్యమూ కాల్పుల విరమణకు తూట్లు పొడుస్తున్న పాకిస్థాన్ తో చిన్న చిన్న యుద్ధాలు చేయక తప్పనిసరి పరిస్థితి నెలకొందని, సైన్యం అనునిత్యమూ సిద్ధంగా ఉండాలని ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ హెచ్చరించారు. జమ్ముకాశ్మీర్ లో వారు కొత్త పద్ధతులతో అలజడులు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. పాక్ ఆలోచనలను ఎప్పటికప్పుడు పసిగడుతున్నామని, ఈ సంవత్సరం ఇంతవరకూ 245 సార్లు పాక్ వైపు నుంచి కాల్పులు జరిగాయని అన్నారు. గతంలో భారత సైన్యం ఉన్న శిబిరాలపై కాల్పులు జరిగేవని, ఇప్పుడు సామాన్యులు లక్ష్యంగా పాకిస్థాన్ కాల్పులు జరుగుతున్నాయని దల్బీర్ సింగ్ తెలిపారు. గత వారంలో ఇండియా, పాక్ మధ్య చర్చలు విఫలమైన తరువాత గ్రామాలపై కాల్పులు జరిపి ఇద్దరు మహిళలను బలి చేశారని, 22 మందికి తూటాల గాయాలయ్యాయని ఆయన గుర్తు చేశారు. పాక్ దురాగతాలను గట్టిగా తిప్పికొడతామని చెప్పారు. పాక్ తో పొట్టి యుద్ధాలకు సైన్యం సర్వసన్నద్ధంగా ఉండాలని అన్నారు.