: పాక్ లో కూలిపోయిన భారత సైనికుడి యుద్ధ విమానం... గ్రేటెస్ట్ ఎస్కేప్!


వార్ టైమ్ మూవీస్ లో మీరు చూసిన కథలకు ఏమాత్రమూ తీసిపోని కథ ఇది. ఓ భారతీయ సైనికుడు పాకిస్థాన్ నుంచి ప్రాణాలతో తప్పించుకు వచ్చిన ఉదంతం ఇది. ఇండియా, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగిన నాటి యుద్ధ కథ ఇది. పూర్తి వివారాల్లోకి వెళితే... 1965, సెప్టెంబర్ 10. ఫ్లయ్యింగ్ ఆఫీసర్ దేరా చినాయ్ (20), ముంబైకి చెందిన యువ పైలెట్. సరిహద్దుల్లో పాక్ మోహరించిన ఆర్టిలరీ వాహనాలను ధ్వంసం చేసేందుకు పంజాబ్ లోని అదంపూర్ ఎయిర్ బేస్ నుంచి, ఫ్రాన్స్ తయారీ దస్సాల్ట్ మిస్టేర్ యుద్ధ విమానంలో బాంబులు నింపుకుని బయలుదేరాడు. ఆపై జరిగింది చినాయ్ మాటల్లోనే... "దక్షిణ పాకిస్థాన్ లోని లక్ష్యాలను పేల్చివేసే పనిని నాకు అప్పగించారు. నా విమానంలో సహ పైలట్ లేడు. విమానం కింద విధ్వంసం సృష్టించగల బాంబులున్నాయి. అవి బరువుగా ఉన్నట్టు నాకు తెలుస్తోంది. లక్ష్యం వైపు విమానాన్ని నడిపించాను. దురదృష్టవశాత్తు, శత్రువుల విమాన విధ్వంసక క్షిపణి ఒకటి నా విమానం ఇంజన్ ను తాకింది. నిప్పులు చెలరేగాయి. ఎంతో సేపు విమానాన్ని కంట్రోల్ చేయలేనని తెలిసిపోయింది. నేను ప్యారాచూట్ సహాయంతో విమానాన్ని వదిలేసి కిందకు దూకాను. శత్రువులకు అతి దగ్గరలో ఉన్నాను. వారి తుపాకుల లక్ష్యం నేనేనని తెలుసు. 'మారో' (చంపండి) అన్న మాటలు వినిపిస్తున్నాయి. తుపాకులు గర్జిస్తున్నాయి. నేను పరుగు లంఘించాను. వారు నన్ను జీపుల్లో వెంటాడుతున్నారు" అంటూ ఆ నాటి విషయాలను పూస గుచ్చినట్టు వివరించారు చినాయ్. "నా అదృష్టం. ఆ ప్రాంతంలో ఆరడుగులకు పైగా పెరిగిన చెరకు తోట కనిపించింది. ఓ కుందేలు మాదిరిగా దాక్కున్నాను. నా దగ్గరున్న అన్ని గుర్తింపు కార్డులు, మ్యాప్ లు తదితరాలన్నీ నాశనం చేశాను. వారు నేను ఇండియా వైపుగా, అంటే తూర్పు దిశగా వెళ్తానని భావించారు. నేను మాత్రం ఉత్తర దిశగా పరుగుపెట్టాను. సూర్యాస్తమయమై, రాత్రి వస్తేనే, నేను ఇండియా వైపు వెళ్లగలనని నాకు తెలుసు. సూర్యాస్తమయాన్ని చూసిన తరువాత తూర్పు దిక్కును గుర్తించి, ఇండియా వైపు పరుగు ప్రారంభించాను. చేరాల్సిన గమ్యం ఎంత దూరం ఉందో తెలియదు. కాసేపు జాగింగ్, కాసేపు పరుగు... ఇలా ఐదు గంటల పాటు నా ప్రయాణంలో చంద్రుడు తోడు నిలిచాడు. గొంతెండుకు పోయింది. శరీరంలో శక్తి నశిస్తోంది. అప్పుడు నాకొచ్చిన భయం ఒకటే. నేను స్పృహ తప్పి పడిపోయి, పాక్ దళాలకు పట్టుబడితే... ఆ భయమే నాకు ఇంకొంత శక్తిని ఇచ్చింది. నా ప్రాణాలు మిగలాలని రాసుందో ఏమో... ఓ బావి కనపడింది. గుండెల నిండా ఆనందంతో కడుపు నింపుకుని తిరిగి ప్రయాణం ప్రారంభించా" అని ఆనాటి ఘటనలను చినాయ్ చెప్పుకొచ్చారు. "నేను ప్రయాణించాల్సిన మార్గం ఎంతో దూరంలో ఉంది. కాలువలు ఈదాను. కొండలెక్కి దిగాను. ఒక్క క్షణం కూడా వృథా చేయలేదు. కొన్ని గ్రామాలు దాటాను. ఎవరి కంటా పడకుండా వెళ్లాల్సిన దిక్కును ఎప్పటికప్పుడు చూసుకుంటూ వస్తుంటే, ఓ రహదారి కనిపించింది. అది అమృతసర్ నుంచి బతాలా వెళ్లే రహదారిగా అనిపించింది. కానీ అదేనని కచ్ఛితంగా చెప్పలేదు. అది ఇండియానే అయినా, నేను క్షేమమేనని అనుకోలేని పరిస్థితి. కాసేపటికి దక్షిణాది భారతీయ భాషల్లో మాట్లాడుకుంటున్న కొందరు సైనికులు కనిపించారు. వారి దగ్గరకు వెళ్లి 'ఎవరక్కడ?' అని ప్రశ్నించాను. ఆ వెంటనే నా తలకు తుపాకులు గురి పెట్టారు. చేతులు పైకెత్తి కూర్చున్నాను. 'నువ్వు ఎవరు?' అన్న ప్రశ్న ఎదురైంది. నేనో ఫ్లయ్యింగ్ ఆఫీసర్ నని చెబితే, గుర్తింపు కార్డు అడిగారు. నా దగ్గరుంటేగా? వాళ్లతో నన్ను తీసుకెళ్లారు. కాసేపటికి నా వివరాలు తెలిశాయి. వారు సైతం సంభ్రమాశ్చర్యాలతో అభినందిస్తూ, నన్ను నా బేస్ కు పంపారు. నా సహచరులు ఘన స్వాగతం పలికారు. ఓ మిత్రుడు ఏమన్నాడో తెలుసా? 'ఓహ్ నో... హీ ఈజ్ బ్యాక్' అని అంటుంటే మనసు ఆనందంతో నిండిపోయింది" అంటూ గర్వంగా చెప్పుకొచ్చారు. ఇదొక్క ఘటనే కాదు. తన పదవీ కాలంలో మరో రెండు సార్లు మృత్యువుకు 'హ్యాండ్' ఇచ్చాడు చినాయ్. గ్రూప్ కెప్టెన్ గా పదవీ విరమణ చేసి ప్రస్తుతం టాటాలు, అంబానీల సొంత కార్పొరేట్ విమానాల్లో పైలట్ గా పనిచేస్తున్నాడు. గ్రేట్ చినాయ్... కాదు గ్రేటెస్ట్ చినాయ్ అనాలేమో! చినాయ్ స్టోరీ ఎన్డీటీవీలో ప్రసారమైంది. అదే చానల్ వెబ్ సైట్లో పెట్టిన ఈ ప్రత్యేక కథనం వేలాది మందిని ఆకర్షించింది. వందలాది మంది చినాయ్ ధైర్యాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. ఇండియాకు చినాయ్ 'జాన్ రాంబో' వంటి వాడని, ఓ యుద్ధ చిత్రం తీయవచ్చని, భరతమాత ముద్దుబిడ్డని, ధైర్యవంతుడి కథను తెలుసుకున్నామని పలువురు స్పందించారు. 50 సంవత్సరాలుగా చినాయ్ కథను వెలుగులోకి రానీయకుండా ఉంచినందుకు రక్షణ మంత్రిత్వ శాఖకు కొందరు అక్షింతలు కూడా వేశారు. ఈ తరహా కథలను పిల్లల పాఠ్యాంశాల్లో జోడించాలని సలహాలు ఇచ్చారు.

  • Loading...

More Telugu News