: నోరు జారిన లంక ఆటగాళ్లకు తల చూపించిన ఇషాంత్ శర్మ!
ఒకవైపు భారత టెయిలెండర్లు కొరుకుడు పడక లంక బౌలర్లు ఇబ్బందులు పడుతున్న వేళ, భారత పేసర్ ఇషాంత్ శర్మ వారికి పుండు మీద కారం చల్లాడు. తనను ఇబ్బంది పెట్టేలా లంక బౌలర్ దమ్మిక ప్రసాద్ వరుసగా బౌన్సర్లు విసురుతుంటే, వాటిని చిరునవ్వుతో తప్పించుకుంటూ మూడు బంతులాడిన ఇషాంత్, ఓ సింగిల్ తీసి మరో బౌన్సర్ వేస్తావా? అంటూ తల చూపించాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ప్రసాద్, ఇషాంత్ దగ్గరికి వచ్చి ఏదో చెప్పడంతో, అంతే కోపంగా ఇషాంత్ సైతం సమాధానం చెప్పాడు. ఆ వెంటనే చండీమల్ వచ్చి నోరు జారడంతో అంపైర్లు కల్పించుకోవాల్సి వచ్చింది. ఆపై కూడా ప్రసాద్ బౌన్సర్ వేయడంతో అంపైర్లు దాన్ని 'నో బాల్' ప్రకటించారు. అప్పటికి కథ ముగిసినా, లంక రెండో ఇన్నింగ్స్ లో చండీమల్ వికెట్ తీసిన ఆనందాన్ని ఇషాంత్ తనదైన శైలిలో ప్రదర్శించాడు. చండీమల్ అవుట్ కాగానే, చేత్తో తన తలను బాదుకుంటూ సెండాఫ్ ఇచ్చాడు. చండీమల్ సైతం కోపంగా చూస్తూ, ఏదో అనుకుంటూ పెవీలియన్ దారి పట్టాడు.