: మళ్లీ రంగంలోకి విష్ణుకుమార్ రాజు... జగన్ తో బీజేఎల్పీ నేత రాయబారం


బీజేపీ నేత, ఏపీ అసెంబ్లీలో ఆ పార్టీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్ రాజు తనదైన శైలిలో రాయబారాలు నడుపుతూ కీలకంగా మారుతున్నారు. ఇప్పటికే మునుపటి అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఎత్తివేత విషయంలో ఆయన అధికార పక్షాన్ని ఒప్పించారు. తాజాగా నిన్న ప్రారంభమైన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా తొలిరోజే ఏపీకి ప్రత్యేక హోదాపై రగడ చోటుచేసుకుంది. అధికార, విపక్షాలు మాటల యుద్ధానికి దిగాయి. ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ రంగంలోకి దిగారు. వైసీపీ అధినేత, సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో విష్ణుకుమార్ రాజు నిన్న ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జగన్ చాంబర్ లో జరిగిన ఈ భేటీలో ప్రత్యేక హోదాపై చర్చలో మాట్లాడేందుకు సర్కారు అవకాశమిస్తుందని విపక్ష నేతకు ఆయన సూచించారు. అయితే ఇప్పటికే ఒంటి గంట దాటిపోయిందని, ఇక తనకెప్పుడు మాట్లాడే అవకాశమిస్తారని జగన్ సందేహాన్ని వ్యక్తం చేశారు. తాను అధికార పక్షంతో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చి అక్కడి నుంచి కదిలారు. నేరుగా అధికార పక్షం వద్దకెళ్లిన విష్ణుకుమార్ రాజు, ప్రతిపక్ష నేత వాదనను టీడీపీ నేతల ముందు పెట్టారు. వారు కూడా విష్ణుకుమార్ రాజు ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని జగన్ కు చేరవేసిన విష్ణకుమార్ రాజు పరిస్థితిని దారిలోకి తెచ్చారు. ఆ తర్వాతే సభలో సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదాపై చర్చను ప్రారంభించారు.

  • Loading...

More Telugu News