: 'వీడొక్కడే' సినిమా సీన్ హైదరాబాదులో రిపీటైంది!
ప్రముఖ తమిళ నటుడు సూర్య నటించిన 'వీడొక్కడే' సినిమా చూశారా?... అచ్చం ఆ సినిమాలో లాంటి సంఘటనే హైదరాబాదులో చోటుచేసుకుంది. దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్ బర్గ్ కు చెందిన మూసా (32) అనే మహిళ కడుపులో డ్రగ్స్ తో హైదరాబాదు విమానాశ్రయం చేరింది. ఆమె నడక అనుమానాస్పదంగా ఉండడంతో అధికారులు ఆమెను స్కాన్ చేయడంతో ఆమె గుట్టు రట్టైంది. ఆమె కడుపులో 40 డ్రగ్ టాబ్లెట్లు ఉన్నాయి. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్తుండడంతో అప్రమత్తమైన అధికారులు ఆమెను హుటాహుటీన ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆమె కడుపులో ఏముందో స్కాన్ చేసిన వైద్యులు సహజ పద్ధతిలో రెండు టాబ్లెట్లు తీశారు. అనంతరం, శాస్త్రీయ పద్ధతిలో సహజమైన విధానం ద్వారా ఆమె కడుపులోని 40 టాబ్లెట్లను బయటకు తీశారు. ఈ టాబ్లెట్లలో ఉండే డ్రగ్స్ ఏంటి? అనేవి నిగ్గు తేల్చేందుకు నార్కోటిక్స్ డిపార్ట్ మెంట్ కు పంపారు. ఆపస్మారక స్థితిలోకి జారుకుంటున్న మూసాకు వైద్యం చేసి సాధారణ స్థితికి తీసుకువచ్చారు. ఆమె పూర్తిగా కోలుకున్నాక, డ్రగ్స్ ఎవరు పంపారు? ఇక్కడ ఎవరికి డెలివరీ ఇవ్వాల్సి ఉంది? నైజీరియన్ ముఠాతో ఆమెకు సంబంధాలు ఉన్నాయా? అనేవి నిగ్గు తేల్చనున్నారు. మూసా హైదరాబాదు రాకముందు, జోహెన్నెస్ బర్గ్ నుంచి దుబాయ్, దుబాయ్ నుంచి బ్రెజిల్, బ్రెజిల్ నుంచి దుబాయ్, దుబాయ్ నుంచి హైదరాబాదు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాదులో పది రోజులు ఉండేలా ఆమె ప్లాన్ చేసుకున్నట్టు పోలీసులు తెలుసుకుని, హైదరాబాదులో ఆమె ఎవరి వద్ద ఉండాలనుకుంది? ఆమెకు ఎవరెవరు తెలుసు? గతంలో డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కున్న సెలబ్రిటీలు, వీఐపీలతో సంబంధం ఉందా? అనే అంశాలను తెలుసుకోనున్నారు.