: నాలుగు మిలియన్ డాలర్లు కొట్టేసి...వాట్స్ యాప్ ద్వారా ఆదేశాలిస్తున్న మేయరమ్మ
భారీ మొత్తంలో డబ్బు కాజేసి, వాటితో జల్సాలు చేసుకుంటూ అధికారులకు వాట్స్ యాప్ ద్వారా ఆదేశాలిస్తున్న మేయర్ గురించి బ్రెజిల్ మీడియాలో పుంఖానుపుంఖాలుగా కథనాలు ప్రసారమవుతున్నాయి. వాటి వివరాల్లోకి వెళ్తే... బ్రెజిల్ లోని పేద మున్సిపాలిటీ బోమ్ జార్డిమ్ కి మేయర్ గా లిడియానే లెయ్టే (25) ఎన్నికైంది. నిరుపేద అయిన లెయ్టే మేయర్ అయిన తరువాత ప్రతాపం చూపడం మొదలు పెట్టింది. దీంతో ఆదిలోనే ఆమెపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. జార్డిమ్ స్కూల్ కు సంబంధించిన నాలుగు మిలియన్ డాలర్ల నిధులు కనిపించకుండా పోయాయి. అప్పటి నుంచి ఆమె కూడా కనిపించకుండా పోయింది. అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా తన జీవిన విధానం గురించి చెబుతోంది. మేయర్ కాకముందు తన దగ్గర పాత ల్యాండ్ రోవర్ కారుండేదని, ఇప్పుడు టొయోటా ఎస్ డబ్ల్యూ4 మోడల్ కారుందని, త్వరలోనే లేటెస్ట్ మోడల్ కారు కొంటానని చెబుతోంది. ఆమె కనిపించకుండా పోయినప్పటికీ మున్సిపాలిటీకి చెందిన పరిపాలనా వ్యవహారాలు వాట్స్ యాప్ ద్వారా పర్యవేక్షిస్తోంది. అధికారులకు ఆదేశాలిస్తోంది. ఆమె కారణంగా జార్డెమ్ స్కూలు పరిస్థితి దిగజారింది. జీతాలివ్వకపోవడంతో టీచర్లు పాఠాలు చెప్పడం మానేశారు. దీంతో స్కూలు అస్తవ్యస్తమైంది. దీంతో ఆమెను పట్టుకునేందుకు బ్రెజిల్ పోలీసులు ఈడెన్ పేరిట ఆపరేషన్ మొదలు పెట్టారు.