: షీనా బోరా హత్య వెనుక అసలు నిజం చెప్పిన ఇంద్రాణి!
భారత కార్పొరేట్ రంగంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకు గల అసలు కారణాన్ని పోలీసుల విచారణలో ఇంద్రాణి ముఖర్జియా వెల్లడించింది. తన రహస్యాలను బయట పెడతానని ఆమె బెదిరించేదని, అందువల్లే షీనాపై అసహ్యాన్ని పెంచుకున్నానని ఇంద్రాణి చెప్పినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే, ఆమెను చంపాలన్న ఉద్దేశం తనకు లేదని ఇంద్రాణి చెప్పిందట. షీనా, తాను ఓ ఆర్థిక వివాదంలో కూరుకుపోయామని కూడా ఇంద్రాణి వెల్లడించింది. తమ మధ్య నిత్యమూ గొడవలు వస్తుండేవని, చాలాసార్లు అవి సిగపట్ల వరకూ వెళ్లాయని తెలిపింది. ఒకసారి భారీ మొత్తంలో నగదును ఆమె ఖాతాలో వేసి, ఆపై తిరిగి ఇవ్వాలని కోరితే, షీనా తిరస్కరించిందని విచారణలో వెల్లడించింది. పీటర్ తో వివాహానికి ముందు తన జీవితంలోని రహస్యాలను బయటపెడతానని నిత్యమూ బెదిరించేదని వివరించింది. తాను రాహుల్, షీనాలను విడదీసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశానని, అన్నీ విఫలమైన తరువాతే ఈ ఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపినట్టు సమాచారం. అయితే, షీనా హత్యవెనుక మరింకేదో కారణం ఉండవచ్చని భావిస్తున్నామని పోలీసులు వెల్లడించడం గమనార్హం.