: సంతాప తీర్మానాలను సభలో వివాదం చేసిన సందర్భం ఇదే!: స్పీకర్ కోడెల
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం చేసిన సంతాప తీర్మానాలపై, తనపై వైఎస్ జగన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను స్పీకర్ కోడెల శివప్రసాద్ ఖండించారు. సంతాప తీర్మానాలను సభలో వివాదం చేసిన సందర్భం ఇదేనని, గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని కోడెల అన్నారు. స్పీకర్ పై, సభపై వ్యాఖ్యలు చేయడం బాధాకరంగా ఉందని పేర్కొన్నారు. 12 గంటల తరువాత కూడా స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టడంపై సభలో జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పన్నెండు తరువాత ఎప్పుడైనా ప్రశ్నోత్తరాలు జరిగాయా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై చర్చ జరగకుండా ఉండేందుకే ప్రభుత్వం ఇలా చేస్తుందన్నారు. ప్రతిపక్ష నేత మాట్లాడేందుకు మాత్రం అనుమతి ఇవ్వరని, అదే చంద్రబాబు మాట్లాడేందుకు 15 నిమిషాల సమయం అనుమతి ఇస్తారని స్పీకర్ పై జగన్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. అంతేగాక తాము సభలో అధికారపక్షంతో కొట్లాడుతున్నామా... మీతో (స్పీకర్) పోరాడుతున్నామా? అనేది అర్థం కావడం లేదని జగన్ విమర్శించారు. దాంతో జగన్ స్పీకర్ కు క్షమాపణ చెప్పాలని అధికారపక్ష సభ్యులు డిమాండ్ చేశారు.