: పవన్ కల్యాణ్ కు భయపడాల్సిన అవసరం ఏముంది?: రోజా
'యథా రాజ తథా ప్రజ' సామెత లాగ... ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా ప్రవర్తిస్తే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా అలానే ప్రవర్తిస్తారని వైకాపా ఎమ్మెల్యే రోజా విమర్శించారు. జగన్ కు అసెంబ్లీ కొత్త అని టీడీపీ నేత బోండా ఉమ అనడాన్ని ఆమె తప్పుబట్టారు. బోండా ఉమ ఏమైనా 10 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారా? అని ప్రశ్నించారు. కేవలం మోదీపై ఉన్న క్రేజ్, పవన్ కల్యాణ్ పై ఉన్న అభిమానంతోనే టీడీపీ అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఈ రోజు పవన్ కు టీడీపీ భయపడాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. టీడీపీకి అంత సీన్ ఉంటే, ఎన్నికల సమయంలో ఓట్ల కోసం పవన్ ఇంటి ముందు పడిగాపులు ఎందుకు పడ్డారని అన్నారు. ఒక వైపు పుష్కర తొక్కిసలాటపై చర్చిద్దామంటూనే, మరోవైపు జగన్ ను మాట్లాడనీయకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా గురించి ప్రకటన చేస్తామని, మీరెందుకు తొందరపడుతున్నారని చంద్రబాబు అంటున్నారని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికే బీజేపీ కాళ్ల వద్ద రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టుపెట్టారని విమర్శించారు. ఈ మధ్యనే 'కోడలు మగ బిడ్డను కంటానంటే, అత్త వద్దంటుందా?' అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కూడా రోజా తప్పుబట్టారు. మహిళలు అంటే చంద్రబాబుకు అంత చులకనా? అని మండిపడ్డారు. అమ్మణ్ణమ్మ లేకపోతే చంద్రబాబు పుట్టేవారా? భువనేశ్వరి లేకపోతే చంద్రబాబుకు లోకేష్ అనే వారసుడు ఉండేవాడా? అని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన సమయంలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ రోజా ఈ వ్యాఖ్యలు చేశారు.