: అమరావతీ నగర అపురూప శిల్పాలివే!
అమరావతి... వేల ఏళ్ల కిందట శాతవాహనుల రాజధాని. బౌద్ధం విరబూసిన నేల. నేడు గుంటూరు జిల్లాలో అమరేశ్వరుడు కొలువైన ప్రాంతం. ఈ ప్రాంత చరిత్రకు సంబంధించి ఇప్పటికే ఎన్నో సాక్ష్యాలు, శాసనాలు వెలుగులోకి రాగా, తాజాగా కొన్ని అపురూప శిల్పాలు బయటపడ్డాయి. అమరేశ్వరాలయానికి దక్షిణం వైపున ఉన్న గాలిగోపురం శిథిలావస్థకు చేరడంతో, దాన్ని తొలగించే పనులు చేపట్టిన అధికారులకు 3వ శతాబ్దానికి చెందిన విలువైన శిల్పాలు కనిపించాయి. వీటిని ధర్మచక్ర ఆరాధన శిల్పాలుగా భావిస్తున్నామని మ్యూజియం ఇన్ చార్జ్ ఎన్.వెంకటేశ్వరరావు వివరించారు. ఆనాటి కాలానికే చెందిన చలువరాతి శివలింగం, పురాతన లిపి కలిగిన నల్లరాతి శిలలు కూడా వెలుగులోకి వచ్చాయని, వీటిని పురావస్తు ప్రదర్శనశాలకు తరలిస్తున్నామని తెలిపారు. కాగా, గాలిగోపురం పునాది భాగంలో మరిన్ని శిల్పాలు బయటపడవచ్చని తెలుస్తోంది.