: నోరుందని అడ్డంగా మాట్లాడితే ఊరుకోం!: జగన్ పై ప్రత్యక్ష దాడికి దిగిన చంద్రబాబు
నోరుందని అడ్డదిడ్డంగా మాట్లాడితే, రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదని వైకాపా నేత, అసెంబ్లీలో విపక్ష నాయకుడు వైఎస్ జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యక్ష దాడికి దిగారు. ప్రత్యేక హోదా కోరుతూ, ఆత్మ బలిదానాలు చేసుకున్న యువకులకు సంతాపాన్ని ప్రకటిస్తూ, చేపట్టిన తీర్మానంపై జరుగుతున్న చర్చ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. చంద్రబాబు తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తరువాత, జగన్ మాట్లాడుతూ, హోదా ఆలస్యమైందని యువకులు ఆత్మహత్యలు చేసుకోవడం లేదని, తెలుగుదేశం, బీజేపీ నేతలు చేస్తున్న అడ్డగోలు స్టేట్ మెంట్లతో మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఆ వెంటనే మైకును అందుకున్న చంద్రబాబు, విభజన జరిగిన తీరును మరోసారి గుర్తు చేశారు. విభజన జరుగుతున్న సమయంలో వైఎస్ జగన్ పార్లమెంటులో ఎక్కడ దాక్కున్నారని తీవ్రంగా విమర్శించారు. హోదా కోసం తాము తీవ్రంగా శ్రమిస్తున్నామని, ఎవరూ ఆత్మహత్యలు చేసుకోరాదని కోరారు. హౌస్ లో గొడవ పెట్టి, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు మాత్రమే విపక్షాలు చూస్తున్నాయని, చర్చించే ధైర్యం వీళ్లకు లేదని నిప్పులు చెరిగారు. తమకు అధికారం ముఖ్యం కాదని, రాష్ట్రాన్ని కాపాడే శక్తి తెదేపాకు తప్ప ఎవరికీ లేదని భావించిన మీదటే ప్రజలు అధికారం ఇచ్చారని అన్నారు. హత్యలు చేయడం వైకాపాకు అలవాటని, ప్రజలను కాపాడేది తామేనని తెలిపారు. అసెంబ్లీని స్తంభింపజేస్తే ప్రజల్లో మంచి పేరు వస్తుందని భ్రమ పడుతున్నారని విమర్శించారు. ప్రతిదానికీ తనపై బురద జల్లితే వాళ్లే చులకనైపోతారని హెచ్చరించారు.