: ద్రావిడ్ నా టెక్నిక్ లో లోపం లేదన్నాడు: పుజారా
ఓపెనర్ గా ప్రమోషన్ పొందిన టీమిండియా యువ బ్యాట్స్ మన్ ఛటేశ్వర్ పుజారా తన ఆటతీరులో ఎలాంటి లోపాలు లేవని స్పష్టం చేశాడు. ఇండియా-ఎ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా అదే అభిప్రాయం వెలిబుచ్చాడని పేర్కొన్నాడు. తన బ్యాటింగ్ టెక్నిక్ లో ఎలాంటి లోపం లేదని ద్రావిడ్ స్పష్టంగా చెప్పాడని, అంతకుమించిన కితాబు ఇంకేముంటుందని తెలిపాడు. తాను ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లోనూ మెరుగ్గానే రాణించానని, అయితే, ఓ మోస్తరు స్కోర్లను భారీ స్కోర్లుగా మలచలేకపోయానని అంగీకరించాడు. ఇకపై క్రీజును అంటిపెట్టుకునేందుకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపాడు. తాజాగా, శ్రీలంకతో సిరీస్ లో తన రెగ్యులర్ స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం లభించకపోయినా నిరాశ చెందలేదని చెప్పాడు. ఇదే చివరి అవకాశంగా భావించి సహజసిద్ధ ఆటతీరు కనబర్చేందుకు ప్రయత్నించానని వివరించాడు. లంకతో చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో పుజారా 145 పరుగులతో అజేయంగా నిలవడం తెలిసిందే.