: పటేళ్ల ఆందోళనలపై ప్రధాని ఆవేదన... గాంధీ పుట్టిన గడ్డపై నెత్తుటి మరకలు బాధాకరమని వ్యాఖ్య
ఓబీసీ రిజర్వేషన్ల కోసం యువ సంచలనం హార్దీక్ పటేల్ ఆధ్వర్యంలో గుజరాత్ పటేల్ సామాజిక వర్గం కొనసాగించిన ఆందోళనపై ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు నేటి ‘మన్ కీ బాత్’ లో ప్రధాని ఈ అంశంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గాంధీ పుట్టిన గడ్డపై నెత్తుటి మరకలు బాధాకరమని మోదీ వ్యాఖ్యానించారు. గుజరాత్ లో పెచ్చరిల్లిన అల్లర్లు యావత్ దేశాన్ని బాధించాయని ఆయన పేర్కొన్నారు. ‘‘గుజరాత్ లో చోటుచేసుకున్న అల్లర్లు దేశం మొత్తాన్ని బాధించాయి. అయితే విజ్ఞులైన గుజరాతీలు తక్షణమే స్పందించడంతో పరిస్థితి తిరిగి అదుపులోకి వచ్చింది. జాతిపిత మహాత్మా గాంధీ నడయాడిన నేలలో ఇలా హింస జరగడం అత్యంత బాధాకరం. అల్లర్లు సద్దుమణిగిన తర్వాత గుజరాత్ లో శాంతి వెల్లివిరిసింది’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.