: ప్రత్యేక హోదాకు చంద్రబాబు వ్యతిరేకమేమో అనిపిస్తోంది!: జగన్


ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిని చూస్తుంటే ప్రత్యేక హోదాకు ఆయన వ్యతిరేకమేమో అనే అనుమానం కలుగుతోందని వైకాపా అధినేత జగన్ అన్నారు. ఈ రోజు జరిగిన బంద్ ను అణచివేయాలని ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేసిందని విమర్శించారు. వైకాపాకు చెందిన 40 మంది ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. అయినా కూడా బంద్ ను విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బంద్ కు సహకరించిన వామపక్షాలకు, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే 90 శాతం గ్రాంట్ వస్తుందని, లోన్లు కేవలం 10 శాతమే ఉంటాయని చెప్పారు. ప్రత్యేక హోదా ఉంటేనే రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు వస్తారని అన్నారు. ప్రత్యేక హోదాను నేషనల్ డెవలప్ మెంట్ కౌన్సిల్ ఇస్తుందని... ఆ కౌన్సిల్ కు ఛైర్మన్ ప్రధాని అని జగన్ తెలిపారు. అందువల్ల, స్పెషల్ స్టేటస్ కు 14వ ఆర్థిక సంఘం ఏమాత్రం అడ్డుకాదని చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తామని ఒక ప్రధానమంత్రి (మన్మోహన్ సింగ్) పార్లమెంటులో ఇచ్చిన హామీని ఇప్పుడు తుంగలో తొక్కుతారా? అని ప్రశ్నించారు. పార్లమెంటుకు విలువ లేకుండా చేస్తారా? అని మండిపడ్డారు. ప్రత్యేక హోదాని డిమాండ్ చేస్తూ చంద్రబాబు తన కేంద్ర మంత్రులను ఎందుకు ఉపసంహరించుకోవడం లేదని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో కూడా ప్రత్యేక హోదాపై పోరాడుతామని అన్నారు. అసెంబ్లీలో కూడా ఇదే విషయమై చంద్రబాబును నిలదీస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News