: చంద్రబాబు అధికారంలోను, జగన్ ప్రతిపక్షంలోను ఉండటం దురదృష్టకరం: రఘువీరా
రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. దాన్ని సాధించేవరకూ పోరాటం చేస్తుందన్నారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త చెన్నాదాస్ నివాసంలో నేడు కార్యకర్తల సమావేశం జరిగింది. రఘువీరా, మాజీ మంత్రులు వట్టి వసంత్ కుమార్, బాలరాజు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ, చంద్రబాబు అధికారంలో ఉండటం, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండటం దురదృష్టకరమని విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసిన ప్రధానమంత్రి, వెంకయ్యనాయుడు, చంద్రబాబుపై రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్ లలో కేసులు పెట్టనున్నట్టు రఘువీరా ఉద్ఘాటించారు. ఏపీలో కాంగ్రెస్ కు పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేయాలని కార్యకర్తలను ఆయన కోరారు.