: బుడిబుడి నడకల చిన్నారులను అక్కున చేర్చుకున్న గవర్నర్ నరసింహన్ దంపతులు, అధికారుల తంటాలు!
ముద్దులొలికే చిన్నారులు ఒక్కొక్కరిగా దగ్గరకు వస్తుంటే, వారందరినీ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దంపతులు అక్కున చేర్చుకుని ముద్దులాడారు. వారందరికీ మిఠాయిలు పంచారు. రక్షాబంధన్ సందర్భంగా రాజ్ భవన్ లో రాఖీ వేడుకలు వైభవంగా జరుగగా, గవర్నరుకు రాఖీలు కట్టేందుకు చిన్నారులు క్యూ కట్టారు. ప్రొటోకాల్ గురించి, గవర్నర్ వద్ద వ్యవహరించాల్సిన తీరు గురించి ఏ మాత్రమూ తెలియని చిన్నారులు తమదైన అల్లరి చేసేశారు. వారిని మురిపెంగా చూస్తూ గవర్నర్ దంపతులు సంబరపడి పోయారు. పిల్లలను ఒక వరుసలో నిలబెట్టి ఫోటోలు తీయించేందుకు అధికారులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఈ సందర్భంగా పలువురు మహిళలు, రాజ్ భవన్ మహిళా అధికారులు గవర్నరుకు రాఖీలు కట్టి అభినందనలు తెలిపారు.