: బంగారం పోయి వజ్రాలు వస్తున్నాయి... 2014లో రూ. 1.13 లక్షల కోట్ల వజ్రాల వ్యాపారం చేసిన ఇండియా
ప్రపంచంలోనే అత్యధికంగా వజ్రాలను దిగుమతి చేసుకుంటున్న దేశంగా చాలా కాలం నుంచి ఇండియా అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తోందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఇండియాలో జరుగుతున్న వజ్రాల వ్యాపారం ఎంత? ఈ ప్రశ్నకు కిబర్లీ ప్రాసెస్ సర్టిఫికేషన్ స్కీమ్ (కేపీసీఎస్) వెలువరించిన తాజా గణాంకాలు సమాధానం చెప్పాయి. 2014లో ఇండియాలో 15.36 కోట్ల క్యారెట్ల ముడి వజ్రాలు దిగుమతి అయ్యాయి. దేశీయ మార్కెట్లో వీటి విలువ 17.21 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.13 లక్షల కోట్లు). యూరోపియన్ యూనియన్ లో సభ్య దేశంగా ఉన్న బెల్జియం నుంచి 11.6 కోట్ల కారెట్ల వజ్రాలు భారత్ కు ఎగుమతి అయ్యాయి. వీటి విలువ 15.71 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.03 లక్షల కోట్లు). ఇండియా తరువాత దుబాయ్, ఇజ్రాయిల్ దేశాలు వజ్రాలను అధికంగా దిగుమతి చేసుకుంటున్నాయి. కాగా, బంగారు ఆభరణాల స్థానంలో భారతీయులు వజ్రాభరణాలపై మక్కువ పెంచుకుంటున్నారు. బంగారం దిగుమతి వృద్ధితో పోలిస్తే వజ్రాల దిగుమతి వృద్ధి పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనం. వజ్రాలు పొదిగిన నగల అమ్మకాలు పెరుగుతున్నాయని జ్యూయలరీ ఇండస్ట్రీపై వివిధ రీసెర్చ్ సంస్థలు నిర్వహించిన సర్వేలు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.