: అధికారులను అవాక్కయ్యేలా చేసిన బంగారం స్మగ్లర్ల సరికొత్త రూట్!
కిలో బంగారం దేశంలోకి తీసుకొస్తే, లక్షల రూపాయలు మిగులుతుండటంతో స్మగ్లర్లు వినూత్న మార్గాలను ఎంచుకుంటున్నారు. తొలినాళ్లలో సెల్ ఫోన్లు, డీవీడీ ప్లేయర్లలో, ఆపై బంగారంపై అల్యూమినియం కోటింగ్ వేసి, ట్రాలీ బ్యాగుల్లో ప్రత్యేక అరలు తయారు చేసి, చివరికి లోదుస్తుల్లో కూడా దాచి బంగారాన్ని తీసుకువచ్చిన స్మగ్లర్లు, ఆ విధానాలన్నీ విఫలం కావడంతో కొత్త రూట్లో నడిచారు. అయితే, కస్టమ్స్ అధికారులు సైతం అంతకుమించిన జాగ్రత్తగా ఉండటంతో దొరికిపోయారు. ఇంతకీ స్మగ్లర్ల కొత్త రూటు ఏంటో తెలుసా? బంగారాన్ని పొడిగా మార్చి రబ్బర్ లో కలిపారు. దానితో షూలు తయారు చేసుకున్నారు. అధికారుల తనిఖీలో మెటల్ డిటెక్టర్ షూ వద్ద 'బీప్' శబ్దాన్ని ఇచ్చింది. సాధారణంగా షూలలో మెటల్ ఉండటం సహజమే. దీని గురించి అధికారులు పెద్దగా పట్టించుకోరు. అయితే, వీరు వేసుకొచ్చిన షూ ఎత్తు ఎక్కువగా ఉండటంతో అనుమానం వచ్చింది. పరీక్షించి, షూ రబ్బర్ ను కరిగించి, హైడ్రోక్లోరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ లతో శుద్ధి చేయగా, 3.3 కిలోల బరువైన బంగారం దొరికింది. ఆ షూలు తమను వాట్స్ యాప్ ద్వారా కాంటాక్ట్ చేసిన ఓ వ్యక్తి దుబాయ్ లో ఇచ్చాడని వాటిని తెచ్చిన వాళ్లు చెప్పారట. ఈ కొత్త స్మగ్లింగ్ మార్గాన్ని చూసి కస్టమ్స్ అధికారులే అవాక్కయ్యారు.