: కొడాలి నాని, వంగవీటి రాధ అరెస్ట్
వైకాపా ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా, విజయవాడలోని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహిస్తున్న ఆ పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వంగవీటి రాధ, కొడాలి నాని తదితరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని స్టేషనుకు తరలించారు. నేతల అరెస్టు అనంతరం కార్యకర్తలు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. విజయవాడలో బంద్ ప్రశాంతంగా సాగుతోంది. జగ్గయ్య పేటలో సామినేని ఉదయభాను, అవనిగడ్డలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జ్ రమేష్ బాబు, తిరుపతిలో నగరి ఎమ్మెల్యే రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు ధర్నాలు చేపట్టారు. ప్రకాశం జిల్లాలో బంద్ పూర్తిగా సాగుతుండటంతో ఒంగోలు, చీరాల, కనిగిరి, పొదిలి, గిద్దలూరు తదితర డిపోల్లోని 800 బస్సులు నిలిచిపోయాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలు, పెట్రోలు బంకులు మూతపడగా, సినిమా హాళ్లలో ఉదయం ఆట లేదన్న బోర్డులు కనిపిస్తున్నాయి.