: పవన్ కల్యాణ్ ఒత్తిడి పనిచేసిందా? ... భూసేకరణ జీవో రద్దు!
పవన్ కల్యాణ్ కల్పించుకున్నందుకో లేదా రైతుల నుంచి పెరుగుతున్న వ్యతిరేకత ఫలితమో... నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకునే ప్రక్రియలో భాగంగా ఏపీ సర్కారు జారీ చేసిన భూసేకరణ జీవో రద్దు కానుంది. ఈ జీవోను రద్దు చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ వెల్లడించారు. ఈ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇతర ప్రాంతాల్లో రైతులు ఇచ్చినట్టుగానే స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. ప్రజా రాజధానిని నిర్మించాలన్నదే చంద్రబాబు అభిమతమని, ఏ రైతుకూ అన్యాయం జరగబోదని ఆయన వివరించారు. రైతులను ఒప్పిస్తామన్న నమ్మకం తమకుందని నారాయణ తెలియజేశారు. కాగా, భూసేకరణ జీవో వెనక్కు తీసుకోవడంపై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.