: ప్రపంచ కుబేరుడి నెల భద్రత ఖర్చు 15లక్షలు
రిలయన్స్ సామ్రాజ్యానికి అధిపతి. ప్రపంచ కుబేరులలో ఒకడు, భారత కుబేర మహారాజైన ముకేశ్ అంబానీకి ఇప్పుడు భద్రతా భయం పట్టుకుంది. తీవ్రవాదుల నుంచి హెచ్చరికలు వస్తుండడంతో ముకేశ్ కు కేంద్ర ప్రభుత్వం జడ్ కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దేశంలో హోం శాఖా మంత్రులు, కొందరు ముఖ్యమంత్రులు, ఇతర అత్యంత ప్రముఖులకు మాత్రమే ఈ భద్రత ఉంటుంది. ఇప్పడు వారి సరసన ముకేశ్ కూడా చేరబోతున్నారు. ఈ రకమైన భద్రతను పొందుతున్న తొలి పారిశ్రామిక వేత్త కూడా ముకేశ్ అంబానీయే!
అయితే ఈ ఖర్చు తానే భరిస్తానని ముకేశ్ ఇప్పటికే ప్రకటించారు. నెలకు సుమారు 15 లక్షల రూపాయల వరకూ ముకేశ్ చెల్లించాల్సి వస్తుందని సీఆర్పీఎఫ్ వర్గాలు వెల్లడించాయి. సుమారు లక్ష కోట్ల రూపాయలకు పైగా సంపదతో తులతూగే ముకేశ్ కు 15 లక్షలు ఏ పాటి?