: కోర్టులోనే మధ్యాహ్న భోజనం చేసిన జగన్
అక్రమాస్తుల కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ కోర్టుల బాట పట్టారు. మొన్నటి దాకా కాస్తంత ఊపిరి పీల్చుకున్న ఆయన ఒక్కసారిగా విచారణ ఊపందుకోవడంతో వారానికోమారైనా కోర్టు మెట్లెక్కక తప్పడం లేదు. కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లన్నీ ఒకదాని వెంట ఒకటిగా విచారణకు వస్తుండటంతో ఆయన కోర్టుకు క్రమం తప్పకుండా హాజరుకావాల్సి వస్తోంది. నిన్నటి విచారణలో భాగంగా సీబీఐ దాఖలు చేసిన 11 చార్జిషీట్లు ఒకేసారి విచారణకు రావడంతో జగన్ తో పాటు ఈ కేసులో సహ నిందితులుగా ఉన్నవారంతా కోర్టుకు వచ్చారు. మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరరావు, మోపిదేవి వెంకటరమణ, గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తదితరులతో పాటు ఐఏఎస్ అధికారులు, వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి తదితరులంతా కోర్టుకు వచ్చారు. వీరంతా దాదాపు మధ్యాహ్నం దాకా కోర్టులోనే ఉండాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కోర్టు ప్రాంగణం కిటకిటలాడింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 4కు వాయిదా పడటంతో జగన్ మినహా మిగిలిన వారంతా మధ్యాహ్నం 2 గంటలకు అక్కడి నుంచి వెళ్లిపోెయారు. ఇంకా అరబిందో, హెటిరోలకు చెందిన కేసుల విచారణ ముగియని నేపథ్యంలో జగన్ మాత్రం సాయంత్రం దాకా అక్కడే ఉండాల్సి వచ్చింది. దీంతో నిన్న మధ్యాహ్నం జగన్ కోర్టు ప్రాంగణంలోనే మధ్యాహ్న భోజనం చేశారు.