: అమ్మ కోసం దొంగతనం చేశాడు...డబ్బు తిరిగిచ్చేసి కటకటాలపాలయ్యాడు!
తల్లి వైద్యం కోసం దొంగతనం చేసి, తల్లి మృతి చెందడంతో దొంగతనం చేసిన డబ్బు తిరిగిచ్చేసి కటకటాలపాలయ్యాడో యువకుడు. తమిళనాడులో చోటుచేసుకున్న ఈ ఆసక్తికర ఘటన వివరాల్లోకి వెళ్తే... ఈ నెల 24న చెన్నైలోని పుదుక్కొట్టై పెరియార్ నగర్ కు చెందిన రిటైర్డ్ ప్రభుత్వాధికారి రాజమాణిక్యం (70) బ్యాంకు నుంచి 5 లక్షల రూపాయలు డ్రా చేసి, భార్య కాత్యాయనికి ఇచ్చి బయటకు వెళ్లిపోయారు. అదే సమయంలో అటుగా వచ్చిన మన్సూర్, మంచినీళ్లు కావాలని కాత్యాయనిని అడిగాడు. మంచినీళ్లు తెచ్చి ఇచ్చేందుకు ఆమె వంటగదిలోకి వెళ్లగానే, అక్కడే వున్న డబ్బుల బ్యాగు తీసుకుని మన్సూర్ ఉడాయించాడు. లబోదిబోమంటూ భర్త రాజమాణిక్యంకు ఫోన్ చేసి విషయం వివరించింది కాత్యాయని. దీంతో దంపతులిద్దరూ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో 26న రాజమాణిక్యం ఇంటికి చేరుకున్న మన్సూర్, తన తల్లికి అనారోగ్యం కారణంగా, వైద్యం చేయించుకునే స్తోమతలేక, గత్యంతరం లేని పరిస్థితుల్లో దొంగతనం చేయాల్సి వచ్చిందని, అయినప్పటికీ తన తల్లి బ్రతకలేదని, వైద్యానికి 50 వేల రూపాయలు ఖర్చయ్యాయని, ఖర్చైన డబ్బుకు ప్రతిగా తన ద్విచక్రవాహనం ఉంచుకోవాలని ఆ దంపతులకు చెప్పి, 4.5 లక్షల రూపాయలున్న బ్యాగు అక్కడ వదిలేసి పరుగుపెట్టాడు. దీంతో వారు చుట్టుపక్కలవారి సహాయంతో మన్సూర్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, విచారిస్తున్నారు. విరాలీమలైకి చెందిన మన్సూర్ (20) తిరుచ్చిలోని పాలిటెక్నిక్ కళాశాలలో చదువుకుంటున్నాడు.