: విచారణ జరుగుతుంటే ఎక్కడికీ పోకూడదు: జగన్ కు కోర్టు అక్షింతలు
అక్రమాస్తుల కేసులో కోర్టు విచారణకు హాజరైన జగన్ అభ్యర్థనను న్యాయమూర్తి నిరాకరించారు. కోర్టులో కేసు విచారణ కాస్త ఆలస్యంగా న్యాయమూర్తి ముందుకు రాగా, అప్పటివరకూ వేచివున్న జగన్, తాను గుంటూరుకు వెళ్లాల్సి వుందని, అందుకు అనుమతించాలని కోరారు. జగన్ తరపు న్యాయవాది ఈ విషయాన్ని న్యాయమూర్తికి తెలియజేయగా, "కోర్టు విచారణ జరుగుతుంటే నిందితులు ఎక్కడికీ పోకూడదు" అని వ్యాఖ్యానించారు. మీ క్లయింటుకు ఈ విషయం తెలియదా? అని అక్షింతలు వేశారు. కాగా, ఈ సాయంత్రం గుంటూరు వెళ్లి ప్రభుత్వాసుపత్రిలో ఎలుకలు కొరికిన ఘటనలో మృతి చెందిన బాలుడి కుటుంబాన్ని పరామర్శించాలని జగన్ భావిస్తున్న సంగతి తెలిసిందే. తన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చడంతో, నేటి జగన్ గుంటూరు పర్యటన వాయిదా పడవచ్చని సమాచారం.