: అహ్మదాబాదులో ఖాకీల ధ్వంసరచన... సీసీటీవీ ఫుటేజీని విడుదల చేసిన ‘పటేల్ కోటా వార్’
పటేల్ సామాజికవర్గానికి ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండుతో యువ సంచలనం హార్దిక్ పటేల్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శన గుజరాత్ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇప్పటిదాకా ఏడుగురు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. రాష్ట్రంలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వాణిజ్య రాజదాని అహ్మదాబాదు వ్యాప్తంగా పోలీసులు నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న అహ్మదాబాదులో అల్లర్లకు ఆజ్యం పోసింది ఎవరన్న విషయంపై హార్డిక్ పటేల్ అనుచరులు ‘పటేల్ కోటా వార్’ పేరిట ట్విట్టర్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ట్విట్టర్ లో హల్ చల్ చేస్తోంది. అసలు ఈ వీడియోలో ఏముందుంటే, ఓ కాంపౌండ్ లోకి మూకుమ్మడిగా చొరబడ్డ పోలీసులు అక్కడ పార్క్ చేసి ఉన్న వాహనాలపై ప్రతాపం చూపారు. చేతిలో ఉన్న కర్రలతో పాటు కొందరు ఏకంగా తుపాకుల మడమలతో కార్లపై విరుచుకుపడ్డారు. అంతటితో ఆగ్రహం చల్లారని గుజరాత్ ఖాకీలు అక్కడ నిలిపి ఉన్న టూవీలర్లను కిందపడేశారు. చేతికందిన రాళ్లను కార్లపైకి విసిరేశారు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. సదరు సీసీటీవీ ఫుటేజీలను ఎలాగోలా సంపాదించిన హార్దిక్ అనుచరులు దానిని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.